కేజ్రీవాల్ ప్రధాని అభ్యర్థి అవుతారా? కేజ్రీవాల్ యొక్క విజయం దేశ జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందా?

0
  1. కేజ్రీవాల్ యొక్క విజయం దేశ జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందా?
  2. ఢిల్లీ ఎన్నికల ఫలితాలను మనమందరం కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
  3. కేజ్రీవాల్ మానసపుత్రిక ఆప్ విజయ రహస్యం ఏమిటి?
  4. జాతీయ రాజకీయాల పైన ఈ పార్టీ యొక్క ప్రభావం ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?
  5. మరి వీటన్నింటి ఫలితంగా కేజ్రీవాల్ ప్రధాని అభ్యర్థి అవుతారా చదువుదాం రండి!!

ఢిల్లీ ఎన్నికల ఫలితాలను గనక గమనించినట్లయితే మతపరమైన జాతిపరమైన రాజకీయాలు ఎన్నడూ కూడా ఒకేరకమైన ఫలితాలను ఇవ్వవు ప్రభావాన్ని చూపవు అని నిరూపిస్తున్నాయి. ఒకసారి మనందరం ఢిల్లీ ఎన్నికల ప్రచార విషయాలను గురించి తెలుసుకుందాం. ఆప్ పార్టీ ముద్దుబిడ్డ కేజ్రీవాల్ తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన సేవల గురించి ప్రచారం చేయడం జరిగింది.

సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ రాష్ట్రంలో అధికారం లో ఉన్నటువంటి పార్టీ తాము అంతవరకు చేసిన పనులు వాటి ఫలితాలు గురించి బాగా ప్రచారం నిర్వహిస్తారు తర్వాత ప్రస్తుత ఎన్నికల్లో మా పార్టీని గెలిపిస్తే మరల మేము ఏమేమి చేయబోతున్నాము అని ప్రచారంతో ప్రజలందరినీ ఆకట్టుకునేలా చేస్తుంటారు.

అయితే కేజ్రీవాల్ మాత్రం దీనికి భిన్నంగా తాము ఇంత వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారో ఆ పనుల గురించి మాత్రమే వాళ్లు ప్రచారం కల్పించారు. ఇదే ఆ పార్టీకి ఉన్నటువంటి ప్రత్యేకత మేము ఇంత వరకు చేసింది ఈ సేవలు మాత్రమే ఈ సేవలన్నీ మీకు నచ్చితేనే మా పార్టీకి ఓటేయండి అని నిస్సంకోచంగా వాళ్ళు ప్రచారాన్ని నిర్వహించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ప్రజలు ఏయే అంశాలైతే కోరుకుంటున్నారో ముఖ్యంగా అవి నాలుగు రకాలు విద్య, వైద్యం, రవాణా రంగం, విద్యుత్ రంగం ఈ నాలుగింటి పైన ఎక్కువ ఫోకస్ చేసి , వీటిని బాగా అభివృద్ధి లోకి తీసుకువచ్చి ప్రచారం నిర్వహించారు. సామాన్య మానవుడు, నగరాల్లో జీవనం కొనసాగిస్తున్న సగటు మనుషులు ఎంతోమంది వారి సంపాదనలో ఎక్కువ శాతం డబ్బులు ఖర్చు పెడుతున్నది ఈ నాలుగింటి కోసమే.

ఇందుకోసమే ఆ పార్టీ ఈ నాలుగు రంగాలను బాగా అభివృద్ధి చేసి మేము చేసిన అభివృద్ధి ఇదే మీకు నచ్చితే మీరు మా పార్టీకి ఓటేయండి అని వాళ్లు ప్రచారం చేశారు. కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిన ఒక విషయం ఢిల్లీలో అభివృద్ధి చెందిన విద్యా రంగం గురించి.

ఎందుకంటే విద్య అభివృద్ధి జరిగినచోట ఆ ప్రాంతం అనేక రంగాలలో ముందుకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆప్ పార్టీ వారి దృష్టి అంతా విద్య పైన కేంద్రీకరించి విద్యను ఆధునికీకరణ విద్యారంగం గా మార్చేసి ప్రపంచ దృష్టి వరకు వెళ్ళింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చేసి వాటిని ఎవరూ ఊహించనంతగా అభివృద్ధి లోకి తీసుకువచ్చి అమెరికా ప్రెసిడెంట్ ట్రంపు దృష్టిని కూడా ఆకర్షించేలా మార్పును తీసుకువచ్చింది ఆప్ పార్టీ.

రెండవ అంశం మొహల్లా క్లినిక్స్: ఇది కూడా ప్రచారంలో వారికి ఒక పెద్ద ఆయుధంగా ఉపయోగపడింది.ఎందుకంటే మొహల్లా అంటే బస్తీ లో నివసిస్తున్న జనం ఎక్కువ శాతం ఆరోగ్యాలకు డబ్బు ఖర్చు పెడుతుంటారు కాబట్టి అలాంటి ఆరోగ్యానికి కొత్త రూపురేఖలు తీసుకువచ్చి నాణ్యమైన వైద్యం అందించడం వల్ల ఈ పార్టీకి చాలా గొప్ప పేరు వచ్చింది.

ఇక మూడవ అంశం రవాణా రంగం: సామాన్య వ్యక్తి నుంచి మొదలు సెలబ్రిటీ వ్యక్తుల వరకు తమ రోజువారి జీవితంలో ప్రయాణం అనేది లేకపోతే వారి జీవితాల్లో మార్పు అనేది ఉండదు. ఇలాంటి రవాణా రంగం పైనా ప్రత్యేకమైన దృష్టి ని కేటాయించింది కేజ్రీవాల్ పార్టీ. ఇక ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచితంగా రవాణా చేయడం అనేది కేజ్రీవాల్ తీసుకున్న అతి గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయం వారి ప్రచారంలో మంచి ఫలితాలను అందించింది.

ఇక నాలుగవ రంగం విద్యుత్ రంగం: ప్రస్తుత సమాజంలో విద్యుత్కు ఎంత ప్రాముఖ్యత ఉందో చదువుకున్న వ్యక్తి నుంచి చదువు రాని వారి వరకు కూడా అందరికీ తెలిసినదే. ఇలాంటి విద్యుత్ నుంచి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో గతంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఎలాగంటే కేవలం విద్యుత్ సంస్కరణలో తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ప్రభుత్వాలు అధికార పార్టీ నుంచి దిగి పోవాల్సి వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి.

మరి కేజ్రీవాల్ పార్టీ ఈ విద్యుత్ రంగం పైన ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. వారు తీసుకున్న ఈ చర్యలు చాలామందికి నచ్చాయి. ఎలాగంటే పూర్తి తక్కువ స్థాయి ఉన్న వారికి విద్యుత్ బిల్లులు లేకుండా ఉచితంగా అందించారు. ఓ రకమైన స్థాయి వారు కరెంటు వినియోగాన్ని బట్టి వారికి ఒక స్లాబ్ నిర్ణయించారు. మధ్యతరగతి వారికి ఒక రకమైన స్లాబు నిర్ణయించారు.

ఇలా సమాజంలో ఆర్థికపరమైన వ్యత్యాసాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ బిల్లుల కోసం వేరు వేరు స్లాబ్ లను ఏర్పాటు చేసి అందరూ మెచ్చుకునేలా చర్యలు తీసుకున్నారు.  ఇది కేజ్రీవాల్ కు బలమైన ఓటు బ్యాంకుగా మారింది.

పైన తెలిపిన విధంగా ప్రధానంగా ఈ నాలుగు అంశాలు కేజ్రీవాల్ గెలుపు కు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తోడ్పాటును అందించాయని గట్టిగా చెప్పవచ్చు. ఇక ఢిల్లీలో ఆ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి బిజెపి పార్టీ. అయితే బిజెపి పార్టీ వాళ్లు అన్ని రాష్ట్రాల్లో చేపట్టినట్లు గానే మతపరమైన రాజకీయ ఎత్తులు ఇక్కడ కూడా చేశారు.

ఉదాహరణకు షహీన్ బాగ్ లో సీఎంకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో బిజెపి విచిత్రమైన ప్రచారాన్ని మొదలు పెట్టింది. ఇందులో భాగంగా కేజ్రీవాల్ని టెర్రరిస్టుగా పేర్కొన్నారు,కేజ్రీవాల్ అక్కడ ఉన్నటువంటి వారికి బిర్యానీ ప్యాకెట్లు పంపించాడు అని ప్రచారం చేశారు. ఇదే ప్రచారంలో నే బీజేపీ వాళ్ళు పాకిస్తాన్ ను కూడా ఒక అంశంగా తీసుకుని ఎన్నో రకాల వ్యతిరేకమైన మాటలతో ఏవేవో చేశారు.

అంతే కాక దేశవ్యాప్తంగా ఉన్న బిజెపి ఎంపీలు అందర్నీ ఢిల్లీలో కేంద్రీకరించి వారిని బస్తీ బస్తీ కి పంపి విపరీతంగా ప్రచారం కల్పించారు. దీన్నే కార్పెట్ ప్రచారం అని కూడా అన్నారు.అంటే విపరీతంగా గుంపులుగుంపులుగా అందర్నీ ఒక చోట చేర్చి విచిత్రమైన ప్రచారాన్ని కల్పించింది బిజెపి పార్టీ.
ప్రచారంలో భాగంగా బిజెపి చేపట్టిన ర్యాలీలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొనడం జరిగింది.

కేజ్రీవాల్ గెలుపుకు సంబంధించి అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటుంది. అది ఏమంటే నరేంద్ర మోడీ కి అభిమానులు, అనుకూలురు ఆయనతో వెంట ఉండేవారు ఎంతోమంది ఆప్ పార్టీ భావజాలానికి ఇష్టపడి, మొగ్గుచూపి ఆప్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళు ఎక్కువ! ఇది మీరు నమ్మండి నమ్మకపోండి జరిగింది ఇదే.

ఇక ఈ ఎన్నికల ఫలితాల యొక్క ప్రభావం జాతీయ రాజకీయాల మీద ఎలా ఉంటుందో చూద్దాం :

దేశ రాజకీయ రూపురేఖల్లో మార్పును తీసుకొచ్చే విధంగా ఆప్ పార్టీ గెలుపు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇది కీలకమైన అంశంగా మారింది.
కేజ్రీవాల్ వారణాసిలో పోటీ చేసినప్పుడు మోడీ గురించి మాట్లాడిన మాటలు కానీ, పంజాబ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలు కానీ, ఇవన్నీ కూడా కేజ్రీవాల్కు జాతీయ రాజకీయాల గురించి ఆయనలో ఉన్న వైఖరిని బయటపెట్టే లా కనిపించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే కేజ్రీవాల్ జాతీయ రాజకీయాల్లో ముందుకు వచ్చేలా కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం కేజ్రీవాల్ లో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి ఎలాగంటే గతంలో కేజ్రీవాల్ కేవలం నిరసనకారుడు, ఆందోళనకారుడు గా మాత్రమే పేరు తెచ్చుకున్నాడు. బిజెపి పార్టీ ఇతనికి గొప్ప ఆందోళనకారుడు అనే బిరుదు ఇచ్చేలా ప్రచారం కల్పించింది. ఉదాహరణకు ప్రచారంలో భాగంగా బిజెపి పార్టీ కేజ్రీవాల్ను ఎంతగా రెచ్చగొట్టినా షహీన్ బాగ్ అక్కడ జరిగిన నిరసనను ఒక పెద్ద అస్త్రంగా ఉపయోగించినా కూడా ఆ రాజకీయ ఉచ్చులోకి వెళ్లకుండా కేజ్రీవాల్ చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

బిజెపి పార్టీ ఎంతగా ఉద్రేక పరచినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కేజ్రీవాల్ ఆ ప్రాంతం లోకి అడుగు కూడా పెట్టలేదు. నేను హిందువులకు వ్యతిరేకం కాదు అని తెలియజేయడానికి హిందూవాదిని అనే ఒక మెత్తటి ముసుగు వేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఎలాగంటే సామాజిక మాధ్యమాల్లో అందరూ చూసే ఉంటారు కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా చదవడం కానీ, వివిధ దేవాలయాల్లో దర్శనానికి వెళ్లడం కానీ సరిగ్గా ఎన్నికల ప్రచారంలో నే చోటు చేసుకున్నాయి.

వీటన్నిటినీ గనుక పరిశీలిస్తే ఇవన్నీ కూడా ఒక పక్కా ప్రణాళికతో జరిగాయని చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలరైజేషన్ కు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ప్రచారాన్ని నిర్వహించారు కేజ్రీవాల్. కేజ్రీవాల్ లో అంతవరకు ఉన్న ఆందోళనకారుని పాత్ర నిరసనకారుడి పాత్ర తొలగించుకుని ఒక వ్యూహకర్తగా, ప్రజలకు ఏదో చేయాలి అనే ఓ సామాజిక నాయకుడిగా వ్యవహరించాడు. భారత దేశ రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా వడివడిగా లౌక్యం మరియు సమయస్ఫూర్తితో అడుగులు వేసుకుంటూ ఒక వ్యూహకర్తగా మార్పులు చేసుకున్నాడు.

prashanth kishore kejriwal

ఇక కేజ్రీవాల్ గెలుపు వెనుక ఉన్న మరో శక్తి ప్రశాంత్ కిషోర్.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని మార్పులు తీసుకు రావడానికి కారణమైన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అని అందరికీ తెలిసిందే. జగన్ రాజకీయ గురువుగా  జగన్ కు చేదోడువాదోడుగా ప్రచార నిర్వహణకు సంబంధించి ప్రతి అడుగును నేర్పిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. మరి ఈ ప్రశాంత్ కిషోర్ కేజ్రీవాల్ కు కూడా రాజకీయ నడకలు నేర్పించాడు. కేజ్రీవాల్ గెలుపుకు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రాజకీయ సూచనలు, సలహాలతో పాటు కొన్ని రాజకీయ ఎత్తులు కూడా సహాయ పడ్డాయి అని చెప్పవచ్చు.

మొత్తంగా కేజ్రీవాల్ గెలుపు ను గమనిస్తే రాజకీయ రంగం మీద రెండు రకాల ప్రభావాన్ని చూపించేలా ఉన్నాయి. కేజ్రీవాల్ ప్రత్యర్థి బిజెపి పార్టీలో ఆత్మవిమర్శ చేసుకునేలా ఉన్నది. బిజెపి పార్టీకి సంబంధించి ఎంతో మంది నాయకులు ఢిల్లీలోనే ఉండి ప్రచారం నిర్వహించినా కూడా కనీసం డబుల్ డిజిట్ కూడా గెలుచుకో లేకపోయారు అంటే బిజెపి పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. అయితే ఢిల్లీలో ఉన్న రాజకీయ వాతావరణాన్ని ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ వాతావరణానికి పోల్చలేం ఎందుకంటే ఈ కాస్మోపాలిటన్ వాతావరణం వేరు మిగతా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ వాతావరణాలు వేరు.

ఎందుకంటే కేజ్రీవాల్ గెలుపుకు ఏ కారణాలు ఉన్నాయో ఆ కారణాలే ఇతర రాష్ట్రాలకు పనిచేస్తాయని చెప్పలేము. కానీ ఖచ్చితంగా ఎంతో కొంత ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ గెలుపు ద్వారా కేజ్రీవాల్ జాతీయ ఆంబిషన్స్ పెంచుకునే అవకాశం ఉంది. ముందు ముందు రాజకీయ వ్యూహాలు మార్చుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ ద్వారా భారత రాజకీయాలు లో కీలక మైనశాఖలో, మార్పులు చోటు చేసుకుంటాయి అని చెప్ప వచ్చును.

ఇక కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే , దేశ రాజధాని న్యూఢిల్లీలో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకుండా కనుమరుగు కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అభిమానులు సైతం ఆప్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూడా పతనం కావడం విశేషం. ఏది ఏమైనా కేజ్రీవాల్ సర్కార్ దేశ రాజకీయాల్లో ఊహించని విధంగా మార్పులు తీసుకు వస్తుంది అని ఆశిద్దాం.