Flax Seeds In Telugu : అవిసె గింజలు ప్రస్తుతం ఆయుర్వేదం నుండి అల్లోపతి, హోమియోపతి వంటి వివిధ వైద్యరంగాలలో ప్రతి డాక్టర్ సూచించే ఆహార పదార్థాలలో ఒకటి. వీటిని లడ్డులు, స్మూతీలు, ప్రోటీన్ బైట్స్ వంటి పుష్టికరమైన పదార్థాల రూపంలో తయారు చేసుకుని తింటారు.
అంతేనా ఇవి కేవలం ఆహారంగానే కాదు చర్మ సంరక్షణ నుండి జుట్టు పెరుగుదల వరకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇంతటి శక్తివంతమైన అవిసె గింజలను మొదట దుస్తుల తయారీలో ఉపయోగించారనే విషయం కాస్త ఆశ్చర్యపరిచేదే. ఒక్కసారి వీటి గూర్చి వివరంగా…
Table of Contents
What Are Flax Seeds In Telugu : అవిసె గింజలు అంటే ఏమిటి?
అవిసె గింజలు ప్రస్తుతం ఫ్లాక్స్ సీడ్స్ గా వైరల్ ఫుడ్ జాబితాలో ఉన్నాయి. ఇవి ఆసియా, యూరప్, మరియు మధ్యధరా దేశాలలో పండుతాయి. ఇవి సాధారణంగా బంగారు పసుపు నుండి ఎరుపు-గోధుమ రంగులో ఉంటాయి.
వీటిలో ఫైటోఈస్ట్రోజెన్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్ సామర్త్యానికి సమానం. అవిసె గింజలను వివిధ రకాలుగా ఉపయోగించడమే కాకుండా వీటి నుండి నూనెను ఉత్పత్తి చేస్తారు.
ప్రస్తుతం వీటికి ఉన్న డిమాండ్ ను అనుసరించి విత్తనాల ఉత్పత్తికె ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అవిసె గింజలను అలాసి, అలివిరై, కామన్ ఫ్లాక్స్, బ్రౌన్ సీడ్ ఫ్లాక్స్ అని ప్రాంతాల వారిగా పిలుస్తారు.
అవిసె గింజలు ఎలా ఉపయోగించాలి ?
వీటిని ఆహార పదార్థంగా తీసుకోవాలని అనుకునేవారు దోరగా వేయించి లడ్డులుగా తీసుకోవచ్చు, అలాగే పిల్లల నుండి పెద్దల వరకు అందరికి పుష్కలంగా శక్తి లభించడానికి డ్రై ఫ్రూట్స్ తో కలిపి ప్రోటీన్ బైట్స్ గా తయారు చేసుకుని తినచ్చు.
అవిసె గింజలను దోరగా వేయించి ఎండు మిర్చితో కలిపి బాగా దంచి కారం పొడి లాగా చేసుకుని అన్నంతో తినవచ్చు. ఇవి మాత్రమే కాకుండా వీటిని ఉడికించగా వచ్చే జెల్ ను చర్మ సంరక్షణలో, జుట్టు ఎదుగుదల కోసం కూడా ఉపయోగించవచ్చు.
Flax Seeds Benefits In Telugu : అవిసె గింజలు ఉపయోగాలు
ఆహారపరంగా అవిసె గింజలు అద్బుతమైనవి. వీటిలో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. వీటిని సూపర్‌ఫుడ్స్‌గా పరిగణిస్తారు,
◆ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను పుష్కలంగా కలిగి ఉంటాయి
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి అనుకూలంగా పనిచేయడానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు, అవిసె గింజలో ఇవి పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది.
ఇది ఒమేగా -3 కొవ్వు ఆమ్లం, ఇది ఎక్కువగా మొక్కల నుండి లభించే అరుదైనది. శరీరం స్వతహాగా ఉత్పత్తి చేయలేని ఈ ఆమ్లం గుండెపోటును తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
◆ అవిసె గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి
పోషకార లోపం ప్రస్తుతం ఎందరినో వేధిస్తున్న సమస్య. అయితే వేలు పోసి ఖరీదైన ఆహారాన్ని తింటేనే పోషకాలు లభిస్తాయని అనుకోవడం మూర్ఖత్వం. అవిసె గింజలు పోషకాలకు పెట్టింది పేరు.
వీటిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, సంతృప్త కొవ్వులు, విటమిన్ బి, విటమిన్ బి 6, ఫోలేట్, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి అద్భుతమైన పోషకాలు అన్ని నింపుకుని ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంలో తీసుకోవడం ఎంతైనా ఉత్తమం.
◆ అవిసె గింజలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి
అవిసె గింజల్లో లిగ్నన్స్ చాలా ఉన్నాయి, ఇవి మొక్కలలో మాత్రమే లభ్యమయ్యే సమ్మేళనాలు, ఇవి ఈస్ట్రోజెన్ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి.
ఈ రెండూ వివిధ రకాల క్యాన్సర్ లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడమే కాక మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవిసె గింజల్లోని లిగ్నాన్స్ కంటెంట్ ఇతర మొక్కల ఆహారాలతో పోలిస్తే 8000 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
వీటిని రోజువారీగా తీసుకోవడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ మరియు చర్మ సంబంధ క్యాన్సర్ లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
◆ రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి
అవిసె గింజల ప్రయోజనాల్లో రక్తపోటు నియంత్రణ కూడా ఒకటి. ఆరునెలల పాటు ప్రతిరోజూ 30 గ్రాముల అవిసె గింజలను తిన్న వారిలో సిస్టోలిక్ రక్తపోటు 10% తగ్గుతుంది.
రక్తపోటు కంట్రోల్ లో పెట్టుకోవడానికి మందులు వాడుతున్నవారు వాటితో పాటు అవిసె గింజలను కూడా తీసుకుంటే గొప్ప ఫలితం ఉంటుంది.
◆ అవిసె గింజల్లో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది
అవిసె గింజల్లో గ్లూటామిక్ ఆమ్లం, అస్పార్టిక్ ఆమ్లం మరియు అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అవిసె గింజల నుండి వచ్చే ప్రోటీన్ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
మరియు బలోపేతం చేయగలదని, కణితుల అభివృద్ధిని నిరోధించగలదని, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుందని ఎన్నో అధ్యయనాల్లో నిరూపించబడింది కూడా.
◆ అవిసె గింజలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి
ఇవి కొలెస్ట్రాల్‌ను మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు రెగులర్ గా మూడు నెలల పాటు అవిసె గింజలను తింటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
తద్వారా గుండెకు ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. అంతేకాదు షుగర్ ఉన్నవారికి కూడా ఇవి గొప్ప వరం. నెలరోజుల పాటు విడవకుండా టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడిని ప్రతిరోజు తీసుకుంటే రక్తంలో చెక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి.◆ అవిసె గింజలు బరువు తగ్గడానికి సహాయపడతాయి
రోజువారీ ఆహారంలో భాగంగా అవిసె గింజలను తీసుకోవడం వల్ల అధికబరువుతో బాధపడుతున్నవారు ఆశ్చర్యపోయే ఫలితాలను చూడవచ్చు. వీటిలో ఫైబర్ అధికం కాబట్టి ఆకలిని నియంత్రించడంలో సహాయపడి బరువు తగ్గేలా చేస్తాయి.
ఇది కూడా చదవండి :- చియా విత్తనాలు మనకు ఎంత మేలు చేస్తాయో తెలుసా ?
Flax Seeds Side Effects In Telugu : అవిసె గింజల దుష్ప్రభావాలు
◆ అవిసె గింజల వల్ల కలిగే ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నప్పటికీ అవి అందరికీ కాకపోవచ్చు. ఉదాహరణకు, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి లేదా ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారు అవిసె గింజలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి ఎక్కువ వేడిని కలిగిస్తాయి.
◆ వీటి అరుగుదలకు జీర్ణశక్తి సామర్థ్యము బాగా ఉండాలి. లేకపోతే ఇవి విరేచనాలను కలిగజేస్తాయి.
◆పెద్దప్రేగు గోడలను ఇబ్బంది పెడతాయి
◆హార్మోన్ల అసమతుల్యత లేదా ఎండోమెట్రియోసిస్ సమస్యను ఎదుర్కొంటున్న వారు అవిసె గింజలను తినకూడదు. ఎందుకంటే అవి శరీరంలో ఈస్ట్రోజోన్ కు వ్యతిరేకంగా పనిచేసి సమస్యను మరింత పెరిగేలా చేస్తాయి.