Makar Sankranti 2020 importance in Telugu- సంక్రాంతి ఎందుకు జరుపుతారు ?

0

importance of sankranti festival in telugu language

సూర్యుడు దక్షిణ దిశ ప్రయాణాన్ని ఉత్తర దిశవైపు మళ్లించడాన్ని మకర సంక్రాంతి గా పేర్కొంటారు.
సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిని సంక్రమణం చేస్తూ ఉంటాడు. ఈ రాశుల సంక్రమణ ప్రక్రియలో అన్ని రాశుల కంటే మకర రాశిని సంక్రమణం చేయడం చాలా ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు నడిచే టువంటి దిశ మారుతుంది కాబట్టి. ఈ దిశ మారడం అంటే దక్షిణాయణం నుంచి ఉత్తరాయణం వైపు నడవడం.
దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటారు. ఇది పుణ్యప్రదమైన టు వంటి సమయం.ఈ పుణ్యప్రదమైన అటువంటి సమయం ఏ రోజైతే వస్తుందో ఆ రోజునే మనం సంక్రాంతి పండుగ అని పేర్కొనటం.
ఆ రోజే సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. దీన్నే మకర సంక్రాంతి అని కూడా అంటారు.

మకర రాశి ని సూర్యుడు పొందినటువంటి రోజు అని అర్థం.తెలుగువారి పండుగలలో ఇది ప్రధానమైన రోజు అని అంటారు ఎందుకంటే పండిన పంట ఇంటికి చేరే రోజు. పశువులు కూడా పాడిని కుండల నిండుగా ఇచ్చే సమయం. మామూలుగా వర్షాకాలంలో, వేసవిలోను పాడి కొంచెం తక్కువగానే ఉంటుంది. ఈ ధనుర్మాసం వచ్చేటప్పటికే ఆవు పాలు ఎక్కువ శాతంలో ఇస్తూ ఉంటాయి. అంతేకాకుండా చెట్లన్నీ కూడా పువ్వులతో కాయలతో నిండుగా ఉంటాయి.

వాతావరణం కూడా మంచు మంచు గా ఉన్నా కూడా చల్లగా హాయిగా ఉంటుంది. ఎంత శ్రమ చేసినా అలసట అనేది ఉండదు. వ్యవసాయ పనులు పూర్తవుతాయి. రైతులు కూడా విశ్రాంతి తీసుకునే సమయం ఇది. పంటల ధాన్యము ఇంటికి చేరి ఉంటుంది ఇంటి నిండా ధాన్యం తో కలకలలాడుతూ ఉంటుంది. మామూలుగా ధనం దగ్గర ఉన్నప్పుడు చేసుకునే పండక్కు ధనం లేనప్పుడు చేసుకునే పండక్కు వ్యత్యాసం బాగా కనిపిస్తూ ఉంటుంది.

ఎంత చిన్న రైతు అయినా తను పండించిన పంట ఇంటికి చేరడం తో సంతోషంగా జరుపుకునే మొట్టమొదటి పండుగ సంక్రాంతి పండుగ. అందుకే ఈ పండుగకు ఆడబిడ్డలను ఇంటికి పిలుచుకుని ఈ పండుగ జరుపుకుంటారు. తప్పనిసరిగా ఆడపిల్లలు ను ఇంటికి పిలుచుకునే పండుగ మకర సంక్రాంతి పండుగ. పూర్వీకుల కథనం ప్రకారం సూర్యుడు మకర రాశి సంక్రమణం చేసే పండుగ కాబట్టి ఈ పండుగ రోజున ధాన్యం దానం చేస్తే చాలా శుభప్రదమని పేర్కొంటారు.

తప్పనిసరిగా ఈ పండుగకు కూష్మాండ దానం చేస్తారు. కుష్మాండం అంటే గుమ్మడి పండు.ఈ కాలంలో ఎక్కడ చూసినా గుమ్మడికాయలు కాస్తుంటాయి గుమ్మడి పండు సంవత్సరం పాటు తాజాగా నిల్వ ఉంటుంది. గుమ్మడి పండు పరిపూర్ణతకు సంకేతంగా ఉంటుంది. ఇంకా భూగోళానికి కూడా సంకేతంగా చెబుతారు. ఇంకా ఈ రోజును బలిచక్రవర్తి భూమి మీదికి వచ్చి భూమినంతా పరిపాలించే ందుకు శ్రీ విష్ణువు అనుమతి తీసుకున్న రోజు అని కూడా అంటారు.

మన ప్రాంతంలో తక్కువ గాని కేరళ ప్రాంతంలో బలిచక్రవర్తికి సంబంధించిన పండుగగానే చేసుకుంటారు. బలిచక్రవర్తి ప్రధానమైన లక్షణం ఏంటంటే దానం చేయడం.దానం చేసే లక్షణం ఉండబట్టే కదా శుక్రాచార్యుడు వద్దన్నా కూడా వామన మూర్తికి మూడు అడుగులు దానం చేసింది.ఒక మనిషిని సంతృప్తిపరచడం అంటే వారికి ఇష్టమైన పని చేయడమే వారికి సంతృప్తిగా కనిపిస్తుంది. కాబట్టి బలిచక్రవర్తి, శ్రీ విష్ణువు వారిద్దరినీ సంతృప్తి పరచాలంటే గుమ్మడి పండు ని దానం చేయాలి. అంటే ఎంతో పవిత్ర పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగ రోజున గుమ్మడి పండ్లను దానం చేసినట్లయితే అది భూదానం చేసినంత గొప్ప ఫలితాన్నిస్తుందని పెద్దలు పేర్కొంటారు.

ఇక భోగి పండుగనాడు భోగి పళ్ళ తో అభ్యంగన స్నానం చేయడం తర్వాత సంక్రాంతి పండుగ రోజు పెద్దలకు తర్పణాలు వేయడం వంటివి చేస్తుంటారు. ఎవరైనా పొరపాటున భోగి పండుగనాడు భోగిపళ్లు అభ్యంగనస్నానం చేయకపోయినట్లయితే మరుసటి రోజైన సంక్రాంతి పండుగ రోజు భోగి పళ్ళు స్నానం చేసి బొమ్మల కొలువు పెట్టి పేరంటం లాంటివి నిర్వహిస్తుంటారు. సంక్రమణం జరిగిన రోజున గుర్తించి ఆ సమయంలోనే పెద్దలకు తర్పణాలు వదలడం అనేది ఒక పద్ధతిగా జరుగుతుంది. అందుకే సంక్రాంతి అనగా దక్షిణాయణకాలం వెళ్లి ఉత్తరాయణం అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే సమయం అని అంటారు.

అందుకే ఈ పండుగను పితృదేవతలకు ఇష్టమైన పండుగ అని అంటారు. పితృ దేవతలు అంటే పెద్దలు తరించి వెళ్ళిన కాలం కాబట్టి దీన్ని పెద్ద పండుగ అని కూడా అంటారు కొన్నిచోట్ల. ముఖ్యంగా తమ వంశంలో పెద్దలు ఎవరైతే తమ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారో వారందరికీ కూడా తర్పణాలు వదలడం ఒక పద్ధతిగా వస్తూ ఉన్నది.దీనివల్ల పెద్దల అనుగ్రహం కలిగి వారి ఆశీర్వాదంతో మంచి సంతానం కలిగి ఆ మంచి సంతానం, మంచి బుద్ధి, మంచితనము అన్ని కలగలిసి ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులను బాగా చూసుకుంటారని ఒక నమ్మకం.

పితృదేవతలకు తర్పణాలు ఎందుకు వదలాలంటే,దక్షిణాయన కాలం పితృదేవతల కాలము గానూ దాని తర్వాత వచ్చే ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకాలం గా పురాణాల్లో పేర్కొనడం జరిగింది. అంటే దీని ప్రకారం దక్షిణాయన కాలమంతా పితృ దేవతలు తమ సంతానానికి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటారని పేర్కొంటారు. ఈ విధంగా అనుగ్రహాన్ని వర్షం లాగా కురిపిస్తున్న టువంటి పెద్దలు తర్వాత ఆరు నెలలపాటు ఈ పక్క లకు రారు. ఈ సమయంలో వారు వెళ్ళిపోతున్నారు గనుక వారికి వీడ్కోలు చెబుతూ, మమ్మల్ని మర్చిపోవద్దని మనకు మంచి అనుగ్రహం ఇవ్వమని ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతూ వారికి తర్పణాలు ఇవ్వడం జరుగుతుంది.

తర్పణం అంటే తృప్తిని కలిగించే ది అని అర్థం. జలం తో మాత్రమే వారికి తృప్తి కలుగుతుంది ఇక్కడి నుంచి మనం ఏ పదార్థం ఇచ్చిన అక్కడున్న దేవతలకు చేరదు కదా. పితృదేవతల పేరు చెప్పి మనము నైవేద్యం పెట్టి మనం తినడమే కానీ వారికి చేరదు కదా. నీటి ద్వారా ఇచ్చినది మాత్రమే వారికి చేరుతుంది అని ఒక అర్థం.
ఇక ఉత్తరాయణ కాలం అంతా కూడా దేవతల కాలంగా చెప్పుకుంటాం. మహారాష్ట్ర ప్రాంతాలలో ఈ పండుగకే తిలసంక్రాంతి పండుగ అని కూడా పేర్కొంటారు. ఎందుకంటే తెలుగులో తిలలు అంటే నువ్వులు.

భోగినాడు నువ్వులతో అభ్యంగన స్నానం చేయడం తర్వాత నువ్వుల పిండితో వొళ్ళు రుద్దుకోవడం వంటి వాటికి చాలా ప్రాధాన్యత ఉంది.అంతేకాకుండా నువ్వులను తినడమో మరియు నువ్వులను దానం చేయడం కూడా చాలా మంచిది మరియు ప్రశస్తమైనది గా పేర్కొంటారు. అందుకని ఉత్త నువ్వులు ఇస్తే ఎవరు తీసుకోరు కాబట్టి నువ్వులతో ఉండలు చేసి నువ్వుల ఉండలని దానం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. లేదంటే అరిసెలు చేసి అరిసెల లో నువ్వులు వేసి అరిసెలు దానం చేయడం చూస్తూ ఉంటాం.

ఈ అరిసెలు తయారు చేయడానికి కూడా అప్పుడే కొత్తగా వచ్చిన బియ్యం నుండి బియ్యపుపిండి కొత్తబెల్లం కొత్తగా చేతికి వచ్చిన పంట నుండి నువ్వు లను తీసుకుని అరిసెలు చేయడం సంప్రదాయం.

పిండి వంట గా అరిసెలు చేయని ఇల్లు అనేది సంక్రాంతి పండుగ రోజున మనకు వెతికినా కనబడనే కనపడదు.
ఈ మకర సంక్రాంతికి ప్రధానమైనటువంటి వంటకము అరిసెలు.పెద్దలు చెప్పిన ప్రకారము ఈ సంక్రాంతి పండక్కు ఇప్పటివరకు చెప్పుకున్నట్టు అన్నీ ఆచరించాలని చెబుతూ ఉంటారు.