Jr.NTR complete biography in Telugu

0
jr NTR biography

Junior NTR biography in telugu : జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు ఏమిటి? ఇంట్లో అంత మంది స్టార్స్ ఉన్నా ఒక పెద్ద కుటుంబంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఒంటరిగా బతకాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ కు ఎందుకు సపోర్ట్ చేయలేదు? బాబాయ్ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి వారసుడు అని ఎప్పుడు అంగీకరించాడు? చంద్రబాబు ఎన్టిఆర్ ని వాడుకున్నాడా? వరుస ఫ్లాపులతో ఉన్న ఎన్టీఆర్ ఎలాంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు? కష్టాలు ఓర్చుకుని తనను తాను ఎప్పుడు మార్చుకున్నాడు? సింహాద్రి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవిని నిజంగానే విమర్శించాడా? 20 సంవత్సరాల వయసులో ఇంత స్టార్డమ్ ఎవరికీ ఇంతవరకు రాలేదా? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు కావాలా, అయితే ఈ ఆర్టికల్ చదవండి.

1983 మే 20వ తేదీన నందమూరి హరికృష్ణ అతని రెండవ భార్య శాలిని లకు మెహదీపట్నం లో జన్మించారు జూనియర్ ఎన్టీఆర్. హరికృష్ణ అతని మొదటి భార్య లక్ష్మీ కు జానకిరామ్, కళ్యాణ్ రామ్, సుహాసిని జన్మించారు. జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు ఒక రోజు అతని అల్లరి శృతిమించడంతో వాళ్ల అమ్మ శాలిని బెల్టుతో కొట్టిందట. దాంతో అలిగి ఇంటి నుంచి పారిపోయి మరలా సాయంత్రం ఇంటికి వచ్చాడు. దాంతో వాళ్ళమ్మ తన కొడుకుని హత్తుకుని, మనసులో తన కొడుకు ఏదైనా ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ నేర్పించాలని అనుకుందట. ఏది నేర్పిస్తే బాగుంటుంది అనే సందిగ్ధంగా ఉన్న పరిస్థితుల్లో కూచిపూడి, భరతనాట్యం నేర్పిస్తే అల్లరి పోయి క్రమశిక్షణ, ఆరోగ్యం రెండు వస్తాయని సన్నిహితులు హరిక్రిష్ణ కు సలహా ఇచ్చారట. ఇక వెంటనే జూనియర్ ఎన్టీఆర్ని డాన్స్ మాస్టర్ సుధాకర్ గారి దగ్గరకు చేర్పించారు. ఆ తర్వాత నృత్యం నేర్చుకుని ఇలాంటి నృత్యప్రదర్శనలు ఎన్నో ఇచ్చాడట. హైదరాబాదులోని విద్యారణ్య స్కూల్ లో చదువుకున్నాడు తారక్.

జూనియర్ ఎన్టీఆర్ కు 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు నా మనవడి ని చూడాలని ఉంది తీసుకురండి అని కబురు పంపితే హరికృష్ణ శాలినీలు సంతోషించి జూనియర్ ఎన్టీఆర్ ను తాతగారైన రామారావు గారి దగ్గరికి తీసుకు వచ్చారు. తారక్ ను మొదటిసారిగా చూసిన రామారావు గారు తన పోలికలతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను చూసి నీ పేరు ఏమిటి? అని అడిగాడు. అప్పుడు తారక్ తన పేరు చెప్పగా, రామారావు గారు హరికృష్ణ వైపు చూసి ఇది ఏమి పేరు? ఈ పేరు నేను మారుస్తాను.అని ఈరోజు నుంచి ఇతనికి నందమూరి తారకరామారావు అని నామకరణం చేశాడు. 1991 ఏప్రిల్ 19న వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్కు భరతుడు అనే పాత్ర ఇచ్చి డైలాగ్ ఎలా మాట్లాడాలి? ఎలా సంభాషణ చేయాలి? ఎలాంటి ముఖకవళికలు చూపించాలి? అని నటనారంగంలో ఉన్న మెలకువలు నేర్పించారు, రామారావు గారు. అంతేకాక రామారావు గారే స్వయంగా మేకప్ కూడా వేశాడు.

తారక్ ఓ 13 ఏళ్ల వయసులో 1996 ఏప్రిల్ 19న గుణశేఖర్ దర్శకత్వంలో, ఎమ్మెస్ రెడ్డి నిర్మాణంలో బాల రామాయణం సినిమా ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు తీసుకున్నది. ఈ సినిమా చూసిన తర్వాత రామారావు గారు తారక్ నా అంశతో పుట్టాడని భవిష్యత్తులో మంచి నటుడు అవుతాడని ఆశీర్వదించాడు అంట. తర్వాత 19 96లో రామారావు గారి మరణం తర్వాత తారక్ కుంగి కృశించి పోయాడు. నందమూరి వారి కుటుంబం తనని, అమ్మను తన వాళ్లుగా చూడకపోవడం చాలా బాధ వేసింది. నందమూరి కుటుంబంలో తాతగారైన రామారావు గారు అభిమానించేవాడు. అలాంటి వ్యక్తి పోయిన తర్వాత మాకు, ఆ కుటుంబంలో విలువలేదని శాలిని గారు దుఃఖించారు. ఆ రోజు నుంచి తనే స్వయంగా సినిమారంగంలో పైకి ఎదగాలని మనసులో గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. అంతే ఒంటరిగా తను కలవని సినిమా ఆఫీస్ లేదు, తను కలవని దర్శకుడు లేరు, తను కలవని నిర్మాత కూడా లేరు.

ఈ క్రమంలోనే ఒకరోజు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ని కలిసి హలో అంకుల్ నా పేరు తారకరత్న, నేను బాల రామాయణం, బ్రహ్మర్షి విశ్వామిత్ర వంటి సినిమాలలో బాల నటునిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాను. దేశ వ్యాప్తంగా ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చాను అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. మీరు ఎంతో మంది యువ హీరోలను పరిచయం చేసి మంచి నటుడిగా తీర్చిదిద్దారు. నాకు కూడా ఇలాంటి అవకాశం కల్పించండి అంకుల్ అని అడిగాడు.అప్పుడు రాఘవేంద్రరావు సరే బాబు నేను నీకు త్వరలోనే కబురు పంపిస్తాను అని అక్కడి నుంచి పంపించాడు.
తర్వాత కొన్ని రోజులకే ఉషా కిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు గారు కొత్త వారితో సినిమా తీయడం మొదలు పెడుతున్నారు అని తెలిసి రాఘవేంద్ర రావు గారు తారక్ గురించి రామోజీరావుకి చెప్పాడట.అప్పటికే రామోజీరావు బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం సినిమాలు చూసి ఉండడం వల్ల అతని ప్రతిభను గుర్తించి రామారావు గారి మనవడైన తారక్ కు హీరోగా అవకాశం ఇచ్చి 2000 సంవత్సరంలో నిన్ను చూడాలని సినిమా నిర్మించాడు.

దీన్ని 2001 మేలో విడుదల చేశారు. అయితే సినిమా అంతగా బాగా లేకపోయినా తారక్ ను చూసిన వాళ్ళందరూ అచ్చం రామారావుగారి పోలికలతో ఉన్నాడని, ఇతనికి భవిష్యత్తు బంగారంలా ఉంటుందని మంచి నటనా చాతుర్యం ఉందని సినిమా పెద్దలందరూ చర్చించుకున్నారు.ఆ తర్వాత రాఘవేంద్రరావు గారి ప్రియ శిష్యుడు రాజమౌళి సొంతంగా సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడని తెలుసుకుని రాఘవేంద్ర రావు రాజమౌళితో NTR గురించి చెప్పాడట. స్వయంగా రాఘవేంద్రరావుగారే తారక్ ను పిలిపించి రాజమౌళి ని పిలిపించి ఇద్దర్నీ ఒకరికొకరు పరిచయం చేసి మీరు సినిమా తీయండి నేను మీ వెనక సపోర్ట్ చేస్తాను అని హామీ ఇచ్చాడట. రాజమౌళి తారక్ ను చూసి ఇతను ఏంటి ఇంత లావుగా ఉన్నాడు తను తీయబోయే మొదటి సినిమాలో హీరో స్లిమ్ గా, బాగా హ్యాండ్సమ్ గా ఉండాలని అనుకున్నాను కదా ఇలాంటి వాడితో సినిమా చేస్తున్నానని చాలా బాధపడ్డాడు అంట.ఏదేమైనా తమ గురువు గారి మాట తీసివెయ్యలేను అని తారక్ తో 2001లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు.అయితే షూటింగ్ మొదలు పెట్టిన కొన్ని రోజులకే తారక్ లో ఉన్న నటనా చాతుర్యాన్ని కనిపెట్టాడు రాజమౌళి.షూటింగ్ లోనే ఇద్దరు బాగా క్లోజ్ అయ్యి, వీళ్ళిద్దరి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది.

నా అభిమాన నటుడు తారక్ అని రాజమౌళి చాలా సార్లు అన్నాడంటే స్నేహానికి రాజమౌళి ఎంత విలువ ఇస్తాడు అనేది అర్థమైంది. ఇదిలా ఉంటే సెప్టెంబరు 7 2011 న కోటి ఎనభై ఐదు లక్షలతో అశ్వినీదత్ నిర్మించి విడుదల చేసిన ఈ సినిమా 12 కోట్ల షేర్ వసూలు చేసి తారక్కి రాజమౌళికి మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాని ఎవరు గుర్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా తారక్, రాజమౌళి, మరో వర్ధమాన నటుడు రాజీవ్ కనకాల ఈ సినిమాని జీవితంలో మర్చిపోలేరు. ఎందుకంటే స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా వారి జీవితానికి తొలి మెట్టు, తొలి విజయం. డిసెంబర్ 21 2001 వసంవత్సరం సుబ్బు అనే సినిమా పరాజయం పొందింది.

స్టూడెంట్ నెంబర్ వన్ విజయం సాధించిన తర్వాత నల్లమలుపు శ్రీనివాస్, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న వివి వినాయక్ ను పరిచయం చేసి తారక్ తో చెప్పాడు మీకు సరిపోయే కథ సిద్ధంగా ఉందని, మీ అభిప్రాయం చెప్పమని అడిగాడు. చాలామంది కథలు చెప్పి విసిగించడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ తర్వాత హైదరాబాద్కు వచ్చి కలుస్తాను అని చెప్పి పంపించాడు. బుజ్జి చాలాసార్లు ఎన్టీఆర్ ఇంటికి ఫోన్ చేసి వారిని ఇబ్బంది పెట్టడంతో వెంటనే తారక్ బుజ్జి ని పిలిపించుకొని కథ విని నచ్చలేదని చెప్పి పంపిస్తామని నిర్ణయించుకున్నాడు.ఆ మరుసటి రోజే వారికి కబుర్లు పంపితే వి.వి.వినాయక్ నల్లమలుపు శ్రీనివాస్ ఇద్దరు వచ్చి కథ చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు తారక్ మొత్తం కథ నాకు వద్దు. హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఇవి మాత్రమే చెప్పండి అని అడిగాడు.అప్పుడు వి.వి.వినాయక్ సరేనండి ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తాను మీకు నచ్చితే కూర్చుండి లేదంటే మేమే వెళ్లి పోతాము అని అన్నాడు.ఇంట్రడక్షన్ ఆసక్తికరంగా ఉండటంతో రెండు గంటలసేపు కథ మొత్తం విన్నాడు తారక్ ఇది ఒక ప్రేమకథ. ఎన్టీఆర్కు కథ నచ్చడంతో ఆ సినిమా చేద్దామని చెప్పాడు.

పేపర్లలో కూడా ఎన్టీఆర్ వివి వినాయక్ సినిమా గురించి ప్రచారం జరిగిపోయింది.సినిమా షూటింగ్ ప్రారంభం లో ఎన్టీఆర్ సన్నిహితుడైన కొడాలి నాని ప్రేమ కథలు వద్దు నీకు మాస్ సినిమాలు బాగుంటాయి అని సలహా ఇచ్చాడు.దాంతో వెంటనే తారక్ బుజ్జి మరియు వినాయక్ ని పిలిపించి నాకు ఈ ప్రేమ కథలు వద్దు ఏదైనా మాస్ కథ ఉంటే చెప్పండి అని అడిగాడు.ఈ మాటతో నిరుత్సాహ పడిన వి.వి.వినాయక్ ఇప్పటికి ఇప్పుడు నా దగ్గర అలాంటి మాస్ కథలు ఏవీ లేవని చెప్పాడు. ఎప్పుడో రాసుకున్న కొన్ని సినిమా సీన్లు గుర్తు చేసుకుని చెప్పాడు. ఒక చిన్న పిల్లవాడు బాంబులు వేసే సన్నివేశం, మరొకటి సుమోలు గాల్లోకి లేసే దృశ్యం.ఈ రెండు సన్నివేశాలు చెప్పి ఇది మీకు నచ్చితే వీటి ఆధారంగా సినిమా కథ రెడీ చేస్తానని చెప్పాడు. అప్పుడు తారక్కు ఇలాంటి ఫ్యాక్షన్ కధ నాకు చాలా హెవీ అయిపోతుంది అని దాట వేద్దామని అనుకున్నాడు.నాకు వారం సమయం ఇవ్వండి పూర్తి కథ రాసుకుని వస్తాను కథ వినండి కథ నచ్చితే సినిమా చేద్దాం లేదంటే కథను వేరే వాళ్ళకి ఇస్తాను అని చెప్పాడు వి.వి.వినాయక్.ఆరోజు ఇద్దరూ బాగా అలసిపోయి ఇంటికి వచ్చారు బుజ్జి బాగా నిద్రపోయాడు కానీ వి.వి.వినాయక్ కు నిద్ర రాలేదు.

కథ మీద దృష్టి పెట్టాడు. మంచి అర్ధరాత్రి మూడు గంటల సమయంలో బుజ్జిని నిద్రలేపి కథ పూర్తి అయ్యిందని చెప్పి వినిపించాడు. తిండి నిద్ర పట్టించుకోకుండా బ్రష్ కూడా చేయకుండా కథను రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యాడు వినాయక్. అలా రెండు రోజులు కష్టపడి 58 సీన్లతో ఆది కథను రెడీ చేశాడు. కథ ఎన్టీఆర్ కు వినిపించగా ఎన్టీఆర్ బాగా ఎగ్జైట్ కి గురి అయి సినిమాకు ఓకే చెప్పాడు. బెల్లంకొండ సురేష్ సమర్పణలో నాగలక్ష్మి నిర్మాతగా బుజ్జి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సినిమా ప్రారంభించారు. అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ మరో ప్రపోజ్ చేశాడు. బూరుగుపల్లి శివరామకృష్ణ నాతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని ఈ సినిమానే ఆయనతో తీద్దామని ప్రతిపాదించాడు. అయితే తనను దర్శకుని చేసేందుకు బుజ్జి ఎంతగానో తపించారని ఇప్పుడు అవకాశం వచ్చాక బుజ్జిని నేను వదిలివేయ లేనని వినాయక్ చెప్పడంతో ఆయన నిజాయితీ నచ్చి అనుకున్న టైంకి షూటింగ్ మొదలు పెట్టారు. 2002 మార్చి 28 తేదీ ఆది పేరుతో రిలీజ్ చేశారు.

ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. సుమారు రెండు కోట్ల తో సినిమా నిర్మిస్తే 22 కోట్లు షేర్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ స్టార్ హీరో అయిపోయాడు. వివి వినాయక్ స్టార్ డైరెక్టర్ గా మారారు. బెల్లంకొండ సురేష్ బుజ్జి పెద్ద నిర్మాతల లిస్టు లో చేరారు. జూలై 2, 2002 సంవత్సరంలో బి.గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన అల్లరిరాముడు యావరేజ్ గా ఆడింది. 2003 జనవరి 10న నాగ సినిమా పరాజయం పాలైంది. అయితే సరిగ్గా ఆరు నెలల తర్వాత జూలై 10 2003 తన మిత్రుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా గురించి ఆంధ్రప్రదేశ్ లోని ఏ తెలుగువాడికి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా అలాంటి బీభత్సాన్ని సృష్టించింది. కేవలం 25 సంవత్సరాల వయసులో తన నటనతో, డాన్సులతో తెలుగు సినిమా పరిశ్రమను షేక్ చేసి రికార్డు సృష్టించి, సునామి సృష్టించాడు.

ఇది కేవలం భారత దేశ చరిత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడికే సాధ్యం అని చెప్పవచ్చు. ఇందులో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు. తాతగారైన రామారావు వారసుడిగా, తాతకు తగ్గ మనవడిగా యావత్ భారతదేశానికి తెలిసింది. అప్పటివరకు నెంబర్ వన్ హీరోగా ఉన్న 25 సంవత్సరాల చరిత్ర ఉన్న చిరంజీవిని వెనక్కి నెట్టేశాడు అంటే అతనికి ఉన్న టాలెంట్ ఏంటో అర్థం అవుతున్నది. అప్పుడు అతనికి వచ్చిన క్రేజ్ ను చూసి వీడు మావాడు అని నందమూరి వంశం అంగీకరించింది. కళ్యాణ్ రామ్ జానకిరామ్ తమ్ముడు అని పిలవడం మొదలుపెట్టారు. బాలకృష్ణ చేసేదేమీ లేక కొంచెం టెంపర్ తగ్గిందనే చెప్పాలి. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ లో తన సొంత గ్రామమైన నిమ్మకూరులో కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఫంక్షన్ జరిగిన గ్రౌండ్ కెపాసిటీ కేవలం 25 వేల మంది మాత్రమే కానీ తెలుగు ప్రజలు 5 లక్షల మందికి పైగా జనం వచ్చి భారతీయ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఆడియో ఫంక్షన్ జరిపించారు.

ఆ తర్వాత ఇలాంటి ఆడియో ఫంక్షన్ రాష్ట్రంలోనే ఎక్కడా జరగలేదు. ఇతని క్రేజ్ సీఎం చంద్రబాబు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. చంద్రబాబు దృష్టి అప్పుడే ఇతని పై పడింది. తెలుగు సినిమా రంగంలో వీడిని ఆపడం ఎవరి వల్లా కాదు అని అనుకున్నాడు చంద్రబాబు. కానీ ఎవరి దిష్టి తగిలిందో తెలియదు కానీ జనవరి 1 2004 న విడుదలైన ఆంధ్రావాలా భారీ అంచనాలతో విడుదలైనా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 2004లో వచ్చిన సాంబ 2005లో వచ్చిన మా అల్లుడు, నరసింహుడు, 2006లో వచ్చిన అశోక్ భారీ పరాజయాన్ని చవి చూశాయి. అదే సంవత్సరం వచ్చిన మరో చిత్రం రాఖి ఈ సినిమా భారీ విజయాన్ని ఇవ్వకపోయినా హిట్ టాక్ తెచ్చింది. ఇందులో ఎన్టీఆర్ బాగా లావుగా ఉన్నాడు అని, ఒక హీరో ఇంతలా వుండడం మంచిది కాదని విమర్శలకు గురయ్యాడు. అతను ఎంత లావు ఉన్నా డాన్స్ లు మాత్రం ఈజ్ తో చేయడం అతనికి ఉన్న ప్రత్యేకత.

ఒకసారి రాజమౌళి నువ్వు సన్నబడితే నే, నేను నీతో యమదొంగ సినిమా చేయగలనని చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ వెంటనే అమెరికాకు వెళ్లి లైపోసక్షన్ ఆపరేషన్ చేయించుకుని సన్నబడి తిరిగి వచ్చాడు. ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు నిద్రపోని జూనియర్ ఎన్టీఆర్ నీ చూసి రాజమౌళి షాక్ అయ్యాడు.జూనియర్ ఎన్టీఆర్ శరీరాకృతి మీద ఎవరైనా కామెంట్ చేస్తే ముందుగా బాధపడేది రాజమౌళినే. వెంటనే 2006 రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్టింగులతో యమదొంగ షూటింగ్ పూర్తి చేశారు. యమదొంగ షూటింగ్ జరుగుతున్నప్పుడు యముడు సీన్ చేస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు చెబుతుంటే సెట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురయ్యారు, చప్పట్లు కొట్టారు అంట. 2007 ఆగస్టు 17 న విడుదలైన చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ భిన్నమైన క్యారెక్టర్లు చేశారు. యమలోకంలో ఆయన వేసిన యముడి పాత్రకు యావత్ లోకమంతా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. వారి తాతగారి లాగానే ఏ పాత్రనైనా చేయగలడని నమ్మకం వచ్చింది.

ఇందులో మోహన్ బాబు గారు యముడిలా గా నటించాడు. 2008లో వచ్చిన కంత్రి సినిమాలో మరీ సన్నగా మారి అసలు ఇతను జూనియర్ ఎన్టీఆర్ నే అనే విధంగా సన్నబడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే 2009లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికలు ప్రచార సందర్భంగా మామయ్య చంద్రబాబు, బాబాయ్ బాలకృష్ణ ప్రచారం చేయమని అడిగితే సంబరపడిపోయి ప్రచారానికి ఒప్పుకున్నాడు. అయితే 2009 మార్చి 26వ తేదీన ప్రచారం ముగించుకుని వస్తుండగా నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గర జరిగిన యాక్సిడెంట్ లో తారక్ ముఖానికి నడుముకి భారీగా దెబ్బలు తగిలాయి. యాక్సిడెంట్లో నటుడు రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నాడు. వీరికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. హాస్పిటల్ లో తారక్ ని చూసిన డాక్టర్లు ఇతను కనీసం ఒక సంవత్సరం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు.ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన డ్యాన్స్ను మర్చిపోవాలని డాక్టర్లు కరాఖండిగా చెప్పేశారు. ఈ సమయంలో వాళ్ళమ్మ శాలిని గారు కుమిలికుమిలి ఏడ్చారు.

దేవుడి దయవల్ల కొడుకు బ్రతికి బయటపడ్డాడు అంతే చాలు అని అనుకుంది. కాని డాక్టర్లు చెప్పిన మాటను వాడికి ఎలా చెప్పాలో అర్థంకాక తనలో తానే కుమిలిపోయారు శాలిని గారు. కానీ తారక్ మాత్రం అభిమానుల ప్రార్థన ఫలితంగా, ఆత్మవిశ్వాసంతో కేవలం ఆరు నెలల లోపే కోలుకొని అదుర్స్ సినిమా షూటింగ్ లో పాల్గొని డాన్సులు కూడా చేసాడు. అంత నడుము నొప్పి తో డ్యాన్సులు చేసిన ఎన్టీఆర్ ని వి.వి.వినాయక్ నువ్వు డాన్సులు చేయకూడదని, అలా డ్యాన్సులు చేస్తే షూటింగ్ ఆపీవేస్తానని అంతేకాకుండా అమ్మకు చెబుతానని బెదిరించాడు vinayak. ఈ మాటలు విని ఎన్టీఆర్ వినాయకుని కూర్చోబెట్టి అన్నా, నాకు ఏమీ కాదు నాకు ఎంతో చేసిన అభిమానుల కోసం ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా అని చెప్పి vinayak ను సముదాయించాడు అట. అయితే అతనికి ఏమీ కాకుండా అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేసారట .2009 డిసెంబర్ 3న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా బాలకృష్ణను పిలిపించారు. 2010 జనవరి 13న విడుదల చేశారు.

చారి, నరసింహ గా రెండవసారి ద్విపాత్రాభినయం చేశాడు. అభిమానులు, సామాన్య ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాలో తారక్ చేసిన కామెడీ ని చూసి ఈ రేంజ్లో చేస్తాడని ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత ఇదే సంవత్సరం అక్టోబర్ 14న దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బృందావనం, ఆ సంవత్సరం వచ్చిన అదుర్స్ తో పాటు అన్ని సినిమాలు టాప్ గా నిలిచాయి. ఒకే సంవత్సరం రెండు హిట్లు కొట్టాడు తారక్. 2011లో శక్తి ,ఊసరవెల్లి 2012లో దమ్ము సినిమా వచ్చినా నిరాశనే మిగిల్చాయి. 2013లో వచ్చిన బాద్ షా బిలో హిట్ గా నిలిచింది .ఇదే సంవత్సరంలో వచ్చిన రామయ్య వస్తావయ్య, 2014లో వచ్చిన రభస ఎన్టీఆర్ సినీ చరిత్రలోనే డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఎన్టీఆర్ గ్రాఫ్ కొంత తగ్గింది. ఎలాంటి కథలు చేయాలో అర్థం కాని పరిస్థితి లో ఉన్నప్పుడు పూరి జగన్నాథ్ ఒక కథ తీసుకుని వచ్చాడు. ఆ కథ నచ్చిన ఎన్టీఆర్, ఒకసారి వంశీ చెప్పిన ఒక కథ ను చెప్పి పూరి ని ఒప్పించాడు.

దాంతో మొదటి సారి వేరే రచయిత చెప్పిన కథతో సినిమా తీశాడు jagannath. బండ్ల గణేష్ నిర్మాతగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. సరిగ్గా ఇదే సమయంలో ఒక సంఘటన జరిగింది. డిసెంబర్ ఆరో తేదీ 2014 నల్గొండ జిల్లా మునగాల మండలం దగ్గర హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న అన్నయ్య జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో తారక్ కుమిలిపోయాడు. ఆ తర్వాత కోలుకొని షూటింగ్ పూర్తి చేసి 2015 ఫిబ్రవరి 13న టెంపర్ సినిమా రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన తో తనలోని కొత్త కోణాన్ని సృష్టించాడు. ఏ హీరో కూడా చేయలేని రిస్కు చేసి డీలా పడ్డ అభిమానుల్ని జోష్ లోకి తీసుకువచ్చాడు. ఈ సినిమా జెమినీ టీవీ లో టెలికాస్ట్ అయినప్పుడు 26.6 రేటింగ్తో ఎవరూ ఊహించని విధంగా గెలిచింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో 2013లో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఇచ్చింది. సంక్రాంతి హిట్ గా నిలిచింది ఇందులో ఎన్టీఆర్ లుక్ ని కొన్ని లక్షల మంది ఫాలో అయ్యారు.

ఈ సినిమాతో అభిమానులు ఆనందంతో ఉన్నా సంతృప్తి చెందలేదు కారణం ఎన్టీఆర్ నుంచి వాళ్ళు ఆశిస్తున్నది మరో సింహాద్రి లాంటి సినిమాలే. వాళ్లు అనుకున్నట్టే కొరటాల శివ దర్శకత్వంలో సెప్టెంబర్ 1 2016 లో విడుదలైన జనతా గ్యారేజ్ తో జూనియర్ ఎన్టీఆర్ తన జూలు విదిలించాడు అని చెప్పవచ్చు. అభిమానులు ఎలాంటి సినిమా కావాలని కోరుకున్నారో అలాంటి సినిమానే ఇచ్చాడు. 13 సంవత్సరాల తర్వాత వచ్చిన ఇలాంటి సినిమాతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఈ సినిమా అతని అభిమానులకు మంచి విందు భోజనమే అని చెప్పవచ్చు. 125 కోట్ల గ్రాస్ తో 77 కోట్లు షేర్ తో అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఎన్టీఆర్ హ్యాట్రిక్ కొట్టాడు. ఈ సంవత్సరం కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ గా రికార్డు సృష్టించాడు. ఇందులో మలయాళ సూపర్ హీరో మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటించాడు. ఆ తర్వాత అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మాతగా భావి దర్శకత్వంలో సెప్టెంబర్ లో 2017 లో వచ్చిన జై లవకుశ తో త్రిపాత్రాభినయం చేశాడు. ఇది బ్లాక్ బస్టర్ సాధించింది. ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు.

ఇందులో ఎన్టీఆర్ చేసిన జై పాత్ర నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఉంటుంది. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ యొక్క అప్పులన్నీ తీరిపోయాయి.
ఈ విధంగా ఆనందంలో ఉన్న సమయంలో ఒక దుర్ఘటన జరిగింది. 2018 ఆగస్టు 29వ తేదీన ఉదయం 6 గంటల 15 నిమిషాలకు తారక్ మరో ప్రాణమైన తన తండ్రి హరికృష్ణకు యాక్సిడెంట్ జరిగిందని వార్త తెలిసింది. ఈ వార్త వినగానే కుప్పకూలిపోయాడు. తారక్ పంటి బిగువున బాధను దిగమింగి నార్కెట్ పల్లి లోని కామినేని హాస్పిటల్ కుటుంబ సభ్యులతో పాటు వచ్చే చూసేసరికి తన తండ్రికి ఇకలేడనే విషయం జీర్ణించుకోలేకపోయాడు.

శోకసంద్రంలో మునిగి పోయి, బాధ గుండెల్లో పెట్టుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్లో పూర్తి చేసి , అక్టోబర్ 3, 2018 న జరిగిన ఆడియో ఫంక్షన్ లో తన బాధనంతా అభిమానుల ఎదుట చెప్పి తాను ఏడ్చి అభిమానులను ఏడిపించి తనకు అండగా నిలిచిన త్రివిక్రమ్ సమక్షం లో ఎవరూ ఊహించని విధంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.ఏది ఏమైనా తన అన్న జానకిరామ్ మరణం తర్వాత సందర్భం వచ్చిన ప్రతిసారి అభిమానుల సమక్షంలో సేఫ్ డ్రైవింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. ఇలాంటిది తన కుటుంబంలోనే మరొక మరణం ఇలా జరగడం అతనిని చాలా బాధపెట్టింది.

యాదృచ్చికంగా నో మరి దురదృష్టంగా నో తెలియదు కానీ వారి కుటుంబంలో జరిగిన యాక్సిడెంట్ మరణం కూడా నల్గొండ జిల్లాలోనే జరగటం ఆశ్చర్యకరం. తర్వాత అక్టోబర్ 11, 2018 న విడుదలైన అరవింద సమేత వీర రాఘవ మరో బ్లాక్ బస్టర్ గా తన అకౌంట్లో వేసుకున్నాడు. ఇలా హ్యాట్రిక్ సాధిస్తూ విజయయాత్ర సాగిస్తున్నాడు. 2017 మాటీవీ లో ప్రారంభమైన బిగ్ బాస్ ప్రోగ్రామ్కు హోస్ట్గా చేసి మరో సాహసం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. 70 రోజులు జరిగిన ఈ సీజన్ ప్రోగ్రాం ని ఎన్టీఆర్ తన మేనరిజంతో, మాటల గారడీతో, తన కామెడీతో ఈ షో ని రక్తి కట్టించాడు. ఆ 70 రోజుల్లో మా టీవీ అత్యధిక రేటింగ్ తో దూసుకెళ్లి పోయింది. మిగతా ప్రముఖ ఛానల్ అన్నింటినీ వెనక్కి నెట్టేసింది, అంటే ఎన్టీఆర్ బుల్లితెర మీద కూడా ఎంత సునామీ సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

తాత సూపర్ స్టార్ బాబాయ్ పెద్ద స్టార్ తండ్రి మరో స్టార్ ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద, తన కుటుంబం నందమూరి కుటుంబం. అలాంటి కుటుంబంలో జన్మించిన తాను సాధారణ వ్యక్తి లాగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఒక శక్తి లాగా ఎదిగాడు .ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాడు. సింహాద్రి విడుదలైన సమయంలో కేవలం 20 సంవత్సరాల వయసులోనే మెగాస్టార్ చిరంజీవి లాంటి వారికి విసిరిన సవాల్ గురించి నాగార్జున ,చిరంజీవి సమక్షంలోనే నవ్వుకుంటాడు మన తారక్. ఇతని అమ్మగారికి ఇతనికి తన కుటుంబంలో జరిగిన అవమానానికి కృంగిపోకుండా వచ్చిన హిట్లతో పొంగి పోకుండా, ఎన్నో కష్టాలు ఓర్చుకుని తనను తాను మార్చుకుని, తనను తాను శిల్పంలా మలుచుకున్నాడు. సినిమా చరిత్రలో తనకంటూ ఒక పేజీని సృష్టించుకున్నాడు. ఇంత మంది స్టార్లు ఉన్న కుటుంబంలో పుట్టి ఏకాకిగా మొదలుపెట్టి స్టార్ గా నిలబడ్డాడు.

ఇలాంటి విచిత్ర పరిస్థితిని చలన చిత్ర చరిత్రలో ఇతనొక్కడే ఎదుర్కొన్నాడు ఏమో అనిపిస్తుంది. july 16 2011 జూనియర్ ఎన్టీఆర్ కు స్టూడియో ఎన్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త రియల్ ఎస్టేట్ బిజినెస్ మాగ్నెట్ నార్ని శ్రీనివాసులు గారి ఏకైక కుమార్తె లక్ష్మీ ప్రణీత తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. abhi ram మరియు భార్గవ్ రామ్. అయితే ఎన్టీఆర్ కి మాత్రం ఒక కూతురు కావాలని కోరిక ఉండేదట, కానీ ఆ దేవుడు కొడుకులను మాత్రమే ఇచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్నారు. వచ్చే సంవత్సరం రాజమౌళి దర్శకత్వంలో మరో స్టార్ హీరోతో రామ్ చరణ్ తో కలిసి నటించి తెలుగు సినీ చరిత్రలో మరో ట్రెండ్ సృష్టించ పోతున్నాడు. ఈ సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలుపుదాం. మరెన్నో మంచి సినిమాలు విజయాలను అందించాలని, తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలు చేపట్టి తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు, ప్రజలకు సేవ చేయాలని ప్రజల మన్ననలను పొంది తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకోవాలని రాజకీయంగా కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

ఇక తారక్ రివార్డులతో పాటు అవార్డులు కూడా పొందాడు. 1996లో బాల రామాయణం లో బాల నటునిగా నంది ప్రత్యేక అవార్డు తీసుకున్నాడు. 2001లో వచ్చిన ఆది సినిమాకు నంది అవార్డులతో పాటు ఫిలిం ఫేర్ అవార్డు సాధించాడు. 2003లో వచ్చిన సింహాద్రి కి సినీ మా అవార్డు, 2007లో వచ్చిన యమదొంగ కు సినీ మా వార్డ్ తో పాటు, ఫిలింఫేర్ అవార్డు తెచ్చుకున్నాడు. 2008లో వచ్చిన కంత్రి కి ఫిలింఫేర్ అవార్డు, 2010లో వచ్చిన అదుర్స్, బృందావనం సినిమాలకు గాను ఫిలింఫేర్ అవార్డు, 2015లో టెంపర్ సినిమా కు ఫిలింఫేర్ అవార్డుతో పాటు కళాసుధ అవార్డు, 2016 లో వచ్చిన జనతా గ్యారేజ్ ఐఫా అవార్డులు తో పాటు కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ అవార్డు, 2017 లో వచ్చిన జై లవకుశ సినిమాలో త్రీ రోల్ ఎక్స్పెరిమెంటల్ అవార్డు లు వరించాయి. జూనియర్ ఎన్టీఆర్కు అవార్డుల కంటే రివార్డులు ఎక్కువగా వచ్చాయి అని చెప్పాలి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి.

source : JR NTR Biography