Ratha Sapthami 2022 – ఇలా పూజ చెయ్యండి

0
సప్తమి తిథి

రథ సప్తమి పూజ విధానం : సూర్యనారాయణ మూర్తి, లోకబాంధవుడు, ఆదిత్యుడు, ఆదిదేవుడు మరియు భాస్కరుడు అంటూ సూర్యుడిని అనేక పేర్లతో కొలుస్తారు. ఇక హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు.

ఇతర నెలల్లో వచ్చే సప్తమి తిథులకన్న మాఘమాసంలో వచ్చే సప్తమి అత్యంత విశిష్టమైంది. ఎందుకంటే, ఈ రోజున సూర్యభగవానుడు యొక్క పుట్టిన రోజుగా హిందువులు జరుపుకుంటారు. సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా…. రథసప్తమి అని పిలవడానికి కారణం ఉంది.

ఏమిటంటే, సూర్యుడి రథానికి ఉన్న చక్రం ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక గాను, చక్రాలకి ఉన్న ఆరు ఆకులు రుతువులకు గుర్తు గా, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో తెలిపారు. అందుకే ఆయన జన్మదినాన్ని రథ సప్తమి అని అంటారు.

పురాణ కధ:-

రామ రావణ యుద్ధ సమయంలో అలసిన శ్రీరాముడికి అగస్య మహాముని ఆదిత్య హృదయం ను 30 శ్లోకాలు రూపంలో ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది. ఈ శ్లోకాలను పఠించినవారికి శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు దగ్గరకు చేరవని నమ్మకం. ఆదిత్యుని (సూర్యుడు) ఆరాదించే వారికి తేజస్సు, ఐశ్వర్యం మరియు ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయని పెద్దల నమ్మకం.

వేకువజాము ప్రాముఖ్యత:-

ఈ పవిత్రమైన మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానమని చెప్పవచ్చు. అందుకనే ఆరోజు వేకువజామునే స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానం వంటి కార్యాక్రమాలను నిర్వహిస్తే, సప్త జన్మల పాపాలు నశిస్తాయి మరియు ఆయురారోగ్య సంపదలను ఇస్తుందని ప్రగాఢ నమ్మకం.

అయితే రథ సప్తమి రోజున స్నానం చేసేటప్పుడు సూర్య భగవానుని మనసారా ధ్యానించి, జిల్లేడాకులు, రేగుపండ్లు తలపై పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి “అర్కః” అని కూడా పేరుంది.

అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు ఏడు గుర్రాల కు చిహ్నం మాత్రమే గాక ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి అని పురాణాలలో ఉంది.

రథసప్తమి నైవేద్యం:-

ఆవు పేడతో చేసిన పిడకలమీద క్షీరాన్నాన్ని వండి సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి. ఈ క్షిరాన్నాన్ని చెరకు ముక్కతో కలుపుతూ తయారు చేయాలి. అలా వండిన దానిని నైవేద్యంగా సూర్యుడికి చిక్కుడు మొక్క ఆకులలో మాత్రమే వడ్డించి నివేదించాలి.

చిక్కుడు, జిల్లేడు, రేగు ఆకుల్లో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది. జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, రాగిపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.

ఇక హిందువులు చేసే పూజలు, వ్రతాలు అన్ని శివ కేశవులకే చెందుతాయని పండితులు చెబుతున్నారు. ఆ ఇరువురికి ఇష్టమైన మాసం మాఘమాసం. అంతేకాదు రథసప్తమి నుంచి వేసవి కాలం ప్రారంభం అని భావిస్తారు. అందుకనే ఆరోగ్య ప్రదాతగా సూర్యుభగవానుణ్ణి పూజిస్తారు. ఈ మహా పర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తీ శ్రద్ధ లతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందగలరు.

మౌని అమావాస్య రోజు ఇలా చేసి కష్టాలను దూరం చేసుకోండి